Australia: ఆస్ట్రేలియాపై భారీగా సైబర్ దాడులు.. చైనాపై అనుమానాలు
- రష్యా, ఉత్తర కొరియాపైనా ఆరోపణలు
- ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై సైబర్ దాడులన్న ఆస్ట్రేలియా ప్రధాని
- అత్యాధునిక పద్ధతుల్లో ఓ దేశం మద్దతుతో దాడని వ్యాఖ్య
- ఆ దేశం పేరును మాత్రం ప్రకటించని ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారీ స్థాయిలో సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ తెలిపారు. అత్యాధునిక పద్ధతుల్లో ఓ దేశం మద్దతుతో హ్యాకర్లు ఈ దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. ఆ దేశం పేరును మాత్రం ఆయన ప్రకటించలేదు. తమ దేశంలోని ప్రభుత్వ, విద్య, వైద్య, అత్యవసర సేవలు వంటి అన్ని రంగాలకు చెందిన సంస్థలపై హ్యాకర్లు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, చైనాతో ఆస్ట్రేలియాకు విభేదాలు ఏర్పడ్డాయి. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. చైనానే ఈ చర్యలకు పాల్పడుతుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మోరిసన్ జవాబు చెప్పడానికి ఒప్పుకోలేదు. అయితే, రష్యా, ఉత్తర కొరియాలను ఉద్దేశించే మోరిసన్ ఈ వ్యాఖ్యలు చేశారని నిఘా విభాగానికి చెందిన కొందరు అంటున్నారు.