India: ఆర్మీ ఆయుధాల రూల్సును మార్చిన ఇండియా!
- సరిహద్దుల వద్ద ఆయుధాలు వాడేందుకు అనుమతి
- సైన్యానికి స్వేచ్ఛ ఇస్తూ ఉత్తర్వులు జారీ
- ఇండియా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది
- హెచ్చరించిన 'గ్లోబల్ టైమ్స్'
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి విధుల్లో ఉండే సైనికులకు అమలయ్యే నిబంధనలను కేంద్రం మార్చింది. ఫీల్డ్ కమాండర్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఆయుధాలను వినియోగించే సౌకర్యాన్ని కల్పిస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటి వరకూ 1996, 2005 సంవత్సరాల్లో చైనాతో కుదిరిన ఒప్పందాల మేరకు, నియంత్రణ రేఖకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ, ఇరువైపులా పేలుడు పదార్థాలు, గన్స్ తదితరాలను వినియోగించేందుకు వీల్లేదు. దశాబ్దాల నాటి ఈ నిబంధనలు, గత వారం చైనా సైనికుల దాడితో 20 మంది జవాన్లు మరణించిన తరువాత మారిపోయాయి.
దీంతో చైనా సైనికులు ఇనుప రాడ్లకు ముళ్లను కట్టి వాడారు. వాళ్ల సైన్యం పదునైన రాళ్లు తెచ్చి, అకస్మాత్ దాడికి దిగారు. భారత భూభాగంలోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద జరిగిన ఈ ఘటనలో మరో 76 మంది భారత జవాన్లకు గాయాలయ్యాయి కూడా. ఇదే ఘటనలో చైనా సైన్యాన్ని భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వారు కూడా మరణించారని తెలుస్తున్నా, ఈ విషయంలో అధికారిక స్పష్టత మాత్రం వెలువడలేదు. 1975లో నలుగురు అసోం రైఫిల్ జవాన్లు అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్ లా పాస్ వద్ద చైనా సైనికుల చేతిలో మరణించిన 45 సంవత్సరాల తరువాత భారత జవాన్లు ప్రాణత్యాగం చేయాల్సి రావడం ఇదే తొలిసారి.
కాగా, ఆయుధాల వాడకంలో నిబంధనలను ఇండియా మార్చడంపై చైనా ఘాటుగా స్పందించింది. చైనా అధికార 'గ్లోబల్ టైమ్స్' చీఫ్ ఎడిటర్ హూ క్సిజిన్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ, "ఇదే నిజమైతే, ఒప్పందానికి ఇండియా తూట్లు పొడిచినట్టే. అటువంటి చర్యలకు భారత సైన్యం దిగితే, భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు" అని హెచ్చరించారు.