Jharkhand: కొత్తగా పెళ్లైన వారిని కాపాడేందుకు నదిలోకి దూకిన స్థానికులు
- జార్ఖండ్ లోని పలాము జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాదం
- వరుడి ఇంటికి వెళ్తుండగా బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయిన కారు
- నదిలో అర కిలోమీటర్ మేర కొట్టుకుపోయిన వాహనం
కొత్తగా పెళ్లైనవారితో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోతున్న సమయంలో... వారిని కాపాడేందుకు స్థానికులు నదిలోకి దూకారు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని పలాము జిల్లాలో చోటు చేసుకుంది. నదిలో సగం మునిగిపోయిన కారును గమనించిన స్థానికులు కొందరు వారిని కాపాడేందుకు నదిలోకి దూకారు. మునిగిపోతున్న కారు నుంచి వారిని కాపాడారు. కారుకు తాడును కట్టి, దాన్ని ఒడ్డుకు లాగారు.
ప్రమాదం వివరాల్లోకి వెళ్తే... పెళ్లి బృందం వరుడి ఇంటికి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కారు నదిలోకి పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి అది కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపు అర కిలోమీటరు దూరం వరకు కారు నదిలో కొట్టుకుపోయింది. దీంతో కారులో ఉన్నవారు ఇక తమ ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు.
అయితే స్థానికులు వారి పాలిట ఆపద్బాంధవులు అయ్యారు. నదిలోకి దూకిన స్థానికులు కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగలగొట్టి, దానికి తాడు కట్టి... ఒడ్డుకు లాగి.. మొత్తానికి వారిని కాపాడారు. ప్రమాద సమయంలో కారులో కొత్త జంటతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడటంతో... వధూవరుల కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. రాంచీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నది నిండుగా ప్రవహిస్తోంది.