Jio: టెలికాం కంపెనీలను కోర్టుకు లాగుతున్న పేటీఎంపై జియో ఆగ్రహం
- మోసపూరితమైన కాల్స్ పై కోర్టును ఆశ్రయించిన పేటీఎం
- మొబైల్ ఆపరేటర్లపై ఫిర్యాదు
- పేటీఎం తప్పించుకోవాలని చూస్తోందన్న జియో
వినియోగదారులను వలలోకి లాగే మోసపూరిత కాల్స్ కు తమను బాధ్యులను చేస్తూ పేటీఎం కోర్టుకెక్కడంపై ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తీవ్రస్థాయిలో స్పందించింది. పేటీఎం తన యాప్ ద్వారా జరిగే ఆర్థిక నేరాలకు సంబంధించి న్యాయపరమైన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతోందని జియో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ టెలికాం ఆపరేటర్లయిన జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ (ఎంటీఎన్ఎల్), బీఎస్ఎన్ఎల్ లతో పాటు ట్రాయ్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. మొబైల్ యూజర్లను ఉచ్చులోకి లాగేందుకు చేసే మోసపూరిత కాల్స్ ను సదరు టెలికాం సంస్థలు అడ్డుకోవడంలేదని పేటీఎం తన పిటిషన్ లో ఆరోపించింది. ఈ పిటిషన్ కు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన జియో వివరణ ఇచ్చింది.
ఫోన్ కాల్స్, సందేశాలకు సంబంధించి జరిగే అక్రమాలకు తాము ఎలా బాధ్యత వహిస్తామని జియో స్పష్టం చేసింది. తాము మధ్యస్థులమేనని, సమాచార వాహకంగా ఉండే తాము ఐటీ యాక్ట్ 79 ప్రకారం ఈ రకమైన వ్యవహారాలకు బాధ్యత వహించలేమని, అందుకు తమకు మినహాయింపు కూడా ఉందని వివరించింది. ఈ దశలో ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.