Centre: నిషేధించాల్సిన చైనా వస్తువులతో జాబితా రూపొందిస్తున్న కేంద్రం!

Centre likely prepares a list to ban in Chinese imports

  • సరిహద్దు ఘర్షణలతో చైనా వస్తువులపై వ్యతిరేకత
  • చైనా వస్తువులు నిషేధించాలని స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలు
  • కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం!

మునుపెన్నడూ లేనంతగా భారత్, చైనా సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం, గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత్ తన సైనికులను కోల్పోవడమే. చైనా బలగాలతో జరిగిన ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ కుమార్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన కారణంగా భారతీయుల్లో చైనా అంటే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభావం కాస్తా చైనా తయారీ వస్తువులపై పడింది. దాంతో ప్రజలే స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రచారం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ వంటి వాణిజ్య విభాగాలతో చర్చలు జరిపిన కేంద్రం నిషేధ వస్తువుల జాబితాను వాటితో పంచుకుంది. ఆ జాబితాలో పెయింట్లు, వార్నిష్ లు, ప్రింటింగ్ ఇంక్, మేకప్ సామగ్రి, హెయిర్ జెల్స్, వీడియో గేమ్ కన్సోల్స్, క్రీడా పరికరాలు, సిగరెట్లు, గాజు పలకలు, రియర్ వ్యూ మిర్రర్లు, వాచీలు ఉన్నాయి.

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆత్మ నిర్భర్ భారత్ పథకంతో పాటు, చైనా ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించే అంశంపైనా చర్చించారు. అయితే, అనేక మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి జాబితాలు రూపొందించినట్టయితే, దేశీయంగా తయారైన ఏ వస్తువులకు చైనా వస్తువులు పోటీగా మారాయన్నది గుర్తించి, వాటినే నిషేధించాలని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News