Donald Trump: అమెరికాలో కొత్త డౌట్... అసలు అధ్యక్ష ఎన్నికలు జరిగేనా?
- కరోనా భయంతో ఈ-మెయిల్ ఓట్లకు అవకాశం కోరుతున్న ప్రజలు
- అలా జరిగితే పెద్ద ఎత్తున అవకతవకలంటున్న డొనాల్డ్ ట్రంప్
- తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించే ఆలోచనలో ట్రంప్
ఈ సంవత్సరం నవంబర్ 3న జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచమంతా పాకగా, అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు కాస్తంత తగ్గినప్పటికీ, ఎన్నికలపై ప్రతిష్ఠంభన నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించగా, ఆయనపై పోటీకి దిగుతున్న జో బిడెన్ సైతం తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పరిస్థితుల్లో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి ఉందా? అనేది అనుమానాలను పెంచుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలు వాయిదా పడతాయని అత్యధికులు అంచనా వేస్తుండటం గమనార్హం.
ఈ అనుమానాలకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. మహమ్మారి భయంతో అత్యధికులు ఈ-మెయిల్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్ బూత్ ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటే మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగినట్టు అవుతుందని, ప్రజలకు ఈ-మెయిల్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తే, పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతాయని ట్రంప్ అన్నారు.
ప్రజలు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి ఉండదని, ఇదే సమయంలో ఈ-మెయిల్ ఓటింగ్ నకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేయరు కాబట్టి ఎన్నికలు వాయిదా పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ అధ్యక్షుడిగా తనకున్న విశిష్ట అధికారాలతో ఎన్నికలను కొంతకాలం పాటైనా వాయిదా వేసేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారని కొందరు రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.