Harish Rao: తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ రావు!
- జూన్ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు
- వేతన బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ
- ఐక్యవేదిక ప్రతినిధులకు తెలిపిన హరీశ్ రావు
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఎంతో మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. వివిధ రకాల పన్నులు ఆగిపోవడంతో ప్రభుత్వ ఖజానాలకు గండి పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. జీతంలో కోత పడటంతో... ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ప్రతినిధులు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. వీరి విన్నపాల పట్ల హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఐక్యవేదిక ప్రతినిధులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలను చెల్లించేందుకు మంత్రి అంగీకరించారని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకుంటున్నట్టు తెలిపారని చెప్పారు. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతన బకాయిలను జీపీఎఫ్ లో కాకుండా... నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని కోరామని తెలిపారు.