bihar: వేడెక్కిన బీహార్ రాజకీయం.. ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి జంప్!
- వచ్చే నెల 6న ఎమ్మెల్సీ ఎన్నికలు
- అక్టోబరు, నవంబరు నెలల్లో శాసనసభ ఎన్నికలు
- ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బేనంటున్న విశ్లేషకులు
బీహార్లో ప్రతిపక్ష ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 6న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 75 స్థానాలున్న శాసన మండలిలో తాజా చేరికలతో జేడీయూ బలం 21కి పెరిగింది. ప్రస్తుతం 29 స్థానాలు ఖాళీగా ఉండగా వచ్చే నెల 6న 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఐదుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి పార్టీని వీడడంతో లాలు ప్రసాద్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు, మున్ముందు మరిన్ని ఫిరాయింపులు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అక్టోబరు-నవంబరు నెలల్లో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీకి ఇది పెద్ద ఎదురుదెబ్బేనని అంటున్నారు.