VK Singh: మనస్తాపంతో... తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా!

Telangana IPS officer VK Singh Resigns

  • ప్రస్తుతం పోలీస్ అకాడమీ సంచాలకునిగా విధులు
  • ప్రమోషన్ ఇవ్వాలని లేఖ రాసినా స్పందించని ప్రభుత్వం
  • గాంధీ జయంతి రోజున పదవీ విరమణకు అనుమతించాలని లేఖ

తనకు డీజీపీగా ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ సంచాలకులు వీకే సింగ్, తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పదవీ విరమణ చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.

తాను 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారినని తన లేఖలో ప్రస్తావించిన వీకే సింగ్, పోలీసు శాఖలో సంస్కరణలు తేవాలని భావించానని, కానీ ఆశయ సాధనలో విఫలమయ్యానని ఆయన వాపోయారు. దశాబ్దాల తన సర్వీసులో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, స్పష్టమైన మనస్సాక్షితో విధులు నిర్వహించానని ఆయన తెలిపారు. కష్టపడటం, నిజాయతీతో ఉండటంతో విజయాలను సాధించవచ్చని గ్రహించానని పేర్కొంటూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని భావిస్తే, పోలీసు శాఖలోనే చేరాలని సూచించారు.

కాగా, వీకే సీంగ్ గతంలో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆపై ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి మార్చిన తరువాత, మీడియా సమావేశం పెట్టి, తన ఆవేదనను బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఆయన్ను పోలీస్ అకాడమీకి మార్చగా, విధుల్లో చేరిన తొలి రోజునే, అకాడమీ డంపింగ్ యార్డులో ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డీజీపీగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎస్ కు ఆయన లేఖ రాసినా, స్పందన రాలేదు. ప్రమోషన్ ఇవ్వకుంటే రిజైన్ చేస్తానని చెప్పిన ఆయన, తాజాగా, రాజీనామా లేఖను పంపించడం గమనార్హం. వాస్తవానికి వీకే సీంగ్ ఈ సంవత్సరం నవంబర్ లో రిటైర్ కావాల్సి వుంది.

  • Loading...

More Telugu News