medical oxygen: పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత.. ప్రపంచంలో సగం మందికి ఆక్సిజన్ కరవు!
- సంపన్న దేశాల్లో ఆక్సిజన్ కూడా ప్రాథమిక అవసరమే
- ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న పేద దేశాలు
- గినియాలో ఒక్క ఆసుపత్రిలోనూ లేని ఆక్సిజన్
ప్రపంచ దేశాల్లో దాదాపు సగం మంది జనాభాకు ప్రాణాధారమైన ఆక్సిజన్ అందుబాటులో లేదని ఓ సర్వే వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ప్రపంచ దేశాలను విపరీతంగా వేధిస్తోంది. ముఖ్యంగా పేద దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. యూరప్, ఉత్తర అమెరికా వంటి సంపన్న దేశాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ లానే ఆక్సిజన్ కూడా ప్రాథమిక అవసరమే. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను పైపుల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని రోగుల బెడ్‌కు పంపిస్తారు.
అయితే, పెరు నుంచి బంగ్లాదేశ్ వరకు ఉన్న పేద దేశాల్లో మాత్రం ఆక్సిజన్ కొరత ప్రాణాలను హరిస్తోంది. కాంగోలో అయితే కేవలం రెండు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంది. టాంజానియాలో 8 శాతం, బంగ్లాదేశ్‌లో ఏడు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. అదే గినియాలో అయితే ఒక్క బెడ్‌కు కూడా ఆక్సిజన్ సరఫరా లేదన్న కఠోర వాస్తవం వెల్లడైంది.