Pakistan: తీరు మార్చుకోని పాక్.. షాకిచ్చిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్!
- నిన్న సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్
- ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలం
- అక్టోబరు నాటికి మారకుంటే బ్లాక్ లిస్టులోకి పాక్
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు చూసే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) షాకిచ్చింది. తమ దేశంలోని ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమైనందుకు గాను పాక్ ను ‘గ్రే లిస్టు’లోనే కొనసాగించాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉగ్రవాదుల విషయంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మార్చుకోకపోవడంతో ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు షియాంగ్‌మిన్ లియూ (చైనా) నేతృత్వంలోని బృందం ఈ నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ ఏడాది అక్టోబరులో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్టయితే ఇరాన్, ఉత్తర కొరియాలానే ‘బ్లాక్ లిస్టు’లోకి చేరుతుంది.