India: మరోసారి లాక్ డౌన్ ఖాయమే... రైల్వేస్ నుంచి సంకేతాలు వచ్చాయంటున్న నిపుణులు!
- జూలై 1 నుంచి అన్ని సాధారణ రైళ్లు రద్దు
- ఇప్పటికే ఆసుపత్రుల్లో నిండుకున్న బెడ్లు
- ఖాళీ కాకుంటే, కొత్త కేసుల చికిత్సకు అవాంతరాలు
- లాక్ డౌన్ అవకాశాలు ఉన్నాయంటున్న నిపుణులు
ఇండియాలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందంటున్నారు పలువురు. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని, ఆపై జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 43 రోజుల పాటు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయినట్టేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారి డబ్బులను వారి ఖాతాల్లోకే జమ చేస్తామని కూడా ప్రకటించింది.
ఇక ఈ ప్రకటనతో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న విశ్లేషణ తెరపైకి వచ్చింది. ప్రయాణాలు చేయాలని భావించిన వారు ఈ ఐదు రోజుల్లోనే గమ్యాలకు చేరుకోవాలని, ఆ తరువాత మరో విడత లాక్ డౌన్ అమలులోకి వస్తుందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో సైతం జూలై 1 నుంచి మరో లాక్ డౌన్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య కరోనా పేషంట్లతో నిండిపోవడం, కొత్త కేసులు వస్తే చికిత్స చేసేందుకు వైద్యులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి పలు మెట్రో నగరాల్లో నెలకొని వుండటంతో, లాక్ డౌన్ అమలుతోనే పరిస్థితి చక్కబడుతుందని ఇటీవల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో అభిప్రాయాలు వెలువడ్డాయి.
మరో నెలన్నర పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తే, ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు రికవరీ అవుతారని, ఆ సమయానికి కేసులు తగ్గడంతో పాటు, వైరస్ ను నిరోధించే డ్రగ్స్ సైతం విరివిగా మార్కెట్లోకి వస్తాయన్న ఆలోచనతో ఉన్న కేంద్రం, అప్పుడు ఒకేసారిగా లాక్ డౌన్ ను ఎత్తివేసి, ఆర్థిక వృద్ధి తిరిగి పుంజుకునేలా అన్ని విధాల వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేలా, ఓ పటిష్ఠ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుంది.