Shashank Bhargava: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే కంపెనీపై బీజేపీ కార్యకర్తల దాడి
- ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ
- ప్రధానికి చేతి గాజులు ఇవ్వాలంటూ అనుచిత వ్యాఖ్యలు
- వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ పోతున్న పెట్రోలు ధరలపై మాట్లాడిన కాంగ్రెస్ నేత ఒకరు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా మధ్యప్రదేశ్‌లోని విదిశలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న విదిశ ఎమ్మెల్యే శశాంక్ భార్గవ మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతికి బంగారు గాజులు ధరించి తిరుగుతుంటారని, ఆమె ప్రధానితో సన్నిహితంగా ఉంటారని పేర్కొన్నారు. కాబట్టి ఆమె ఇతర వాటికి కంటే తన చేతికి ఉన్న బంగారు గాజులను ప్రధానికి ఇచ్చి ఇంధన ధరల పెంపును వెనక్కి తీసుకోవాల్సిందిగా అభ్యర్థించాలని మీడియా ద్వారా కోరుతున్నట్టు పేర్కొన్నారు.
శశాంక్ భార్గవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్తలు విదిశాలోని భార్గవ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. భార్గవ కార్యాలయంపై దాడిచేసి ధ్వంసం చేశారు. అలాగే, వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాగా, బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుపై పోలీసులు సెక్షన్ 294, 504 కింద శశాంక్ భార్గవ్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.