Raghurama Krishnamraju: వైసీపీ షోకాజ్ నోటీసులపై కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు!
- నరసాపురం ఎంపీకి నోటీసులు పంపిన వైసీపీ
- లెటర్ హెడ్ పై మరో పేరు ఉందన్న రఘురామకృష్ణంరాజు
- తన అభ్యంతరాలను ఎన్నికల సంఘం అధికారులకు నివేదన
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ తనకు పంపిన షోకాజ్ నోటీసుల చెల్లుబాటు అంశంపై ఆయన ఎన్నికల సంఘం అధికారులతో చర్చించారు.
పార్టీ లెటర్ హెడ్ పై కాకుండా మరో పేరుతో వున్న లెటర్ హెడ్ పై నోటీసులు వచ్చాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల లెటర్ హెడ్ పై వైసీపీ అని ఉందని, పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినందున తాను ఆ నోటీసులను ఏ విధంగా చూడాలి? అనే విషయంలో రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరుతున్నారు.
పైగా, ఆ నోటీసులు తనకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరిట వచ్చాయని, ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటాడన్న సందేహాన్ని కూడా ఆయన అధికారుల ముందు వెలిబుచ్చినట్టు సమాచారం. పైగా, ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుందని, కానీ వైసీపీలో అలాంటి కమిటీ లేదని ఆయన అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది.