Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. 4,374 పరీక్షలు చేస్తే 985 మందికి పాజిటివ్!
- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 75,308 మందికి పరీక్షలు
- తెలంగాణలో 12 వేలు దాటిన కేసులు
- కరోనా కాటుకు 237 మంది బలి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 985 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవే 774 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 4,374 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 75,308 మందికి పరీక్షలు నిర్వహించారు.
నిన్న నిర్వహించిన పరీక్షల్లో 3,389 మందికి నెగటివ్ అని తేలగా, 985 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య వీటితో కలుపుకుని 12,349కి చేరుకోగా, 7,436 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,766కు పెరిగింది. కరోనా బారినపడి నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 237కు పెరిగింది.
నిన్న నమోదైన కొత్త కేసుల్లో 774 జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌లో 53, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, సిద్దిపేటలో 3, వరంగల్ అర్బన్‌లో 20, ములుగు, జగిత్యాల, యాదాద్రి భువనగిరిలలో రెండేసి, వికారాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలలో ఒక్కో కేసు, మెదక్‌లో 9, ఆదిలాబాద్‌లో 7, భూపాలపల్లి, ఖమ్మంలలో మూడేసి, నాగర్ కర్నూలు, నిజామాబాద్‌లలో ఆరేసి కేసుల చొప్పున నమోదయ్యాయి.