Donald Trump: ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ గెలుస్తారు: డొనాల్డ్ ట్రంప్
- ఎందుకంటే కొందరు నన్ను ఇష్టపడట్లేదు
- బిడెన్ మంచి వ్యక్తా? కాదా? అన్నది పక్కన పెడదాం
- ఆయనకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు
- నేను అమెరికా కోసం అంతా మంచే చేశాను
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తనతో పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన ప్రత్యర్థి జో బిడెన్ మంచి వ్యక్తా? కాదా? అన్న విషయాన్ని పక్కన పెడితే, సరిగ్గా మాట్లాడలేని నేత దేశానికి అధ్యక్షుడు కావడం ఎంతవరకు సరైందో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు.
జోడెన్ రెండు వాక్యాలను కూడా సరిగ్గా పలకలేరని ట్రంప్ ఎద్దేవా చేశారు. తాను ఇప్పటివరకు అమెరికా కోసం అంతా మంచే చేశానని, అయినప్పటికీ దేశ అధ్యక్షుడిగా తనను కొంతమంది ఇష్టపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ సారి అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ గెలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కరోనాను 'చైనా ప్లేగు' గా అభివర్ణిస్తూ ఆ వైరస్ తమ దేశంలోకి రాకముందు వరకు తన పాలన వల్ల దేశంలోని యువతకు ఎన్నడూ లేనన్ని ఉద్యోగాలు వచ్చాయని, అమెరికా ఎన్నడూ లేనంత ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పారు.
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో పాలు పంచుకున్న 49 శాతం మంది అమెరికన్లు తమ దేశ అభివృద్ధి కోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేవని తెలిపారు.