USA: అమెరికా సైనికులను చంపాలంటూ తాలిబాన్ ఉగ్రవాదులకు రష్యా సైన్యం సుపారీ!
- న్యూయార్క్ టైమ్స్ లో ఆసక్తికర కథనం
- 2019లో 20 మంది అమెరికా సైనికుల మరణం
- స్పందించేందుకు నిరాకరించిన వైట్ హౌస్, సీఐఏ
రష్యాపై అమెరికా నిఘా సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సైనికులను, సంకీర్ణ దళాల వారిని చంపేందుకు రష్యా సైన్యం స్థానిక తాలిబాన్ అనుబంధ ఉగ్రవాదులకు సుపారీ ఆఫర్ చేసిందని అమెరికా నిఘా వ్యవస్థలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అంతేకాదు, యూరప్ లోనూ తమ సైనికులపై జరిగిన దాడుల వెనుక ఓ రష్యా మిలిటరీ ఏజెన్సీ హస్తం ఉన్నట్టు అమెరికా నిర్ధారించుకుందని ఈ కథనంలో వివరించింది.
తమ నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారని, అయితే, దానిపై రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపింది. 2019లో వివిధ పోరాటాల్లో 20 మంది అమెరికా సైనికులు మరణించిన వ్యవహారం ఇప్పటికీ నిగ్గు తేలలేదని వివరించింది. అయితే న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనంపై స్పందించేందుకు వైట్ హౌస్, సీఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం నిరాకరించాయి.