Hyderabad: రాత్రంతా భారీ వర్షం... కుంభవృష్టితో హైదరాబాద్ ప్రజల నానా అవస్థలు!

Heavy Rain In Hyderabad

  • నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం
  • ఎల్బీ నగర్ ప్రాంతంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షం
  • ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగానే వర్షాలు
  • మరో రెండు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రంతా ఎక్కడో ఒకచోట వర్షం పడుతూనే ఉంది. నిన్న రాత్రి సమయానికే ఎల్బీ నగర్ ప్రాంతంలో 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో 9.3 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 8.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఖైరతాబాద్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో 6 నుంచి 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

మధ్యప్రదేశ్ లోని మరాట్వాడా నుంచి తెలంగాణ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించివున్న ఉపరితల ద్రోణి కారణంగానే వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఉదయం నిద్రలేచి, తమ నిత్యావసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన హైదరాబాద్ ప్రజలు పలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రహదారులపై రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. పలు జంక్షన్లలో ఇసుక, మట్టి పేరుకుపోయాయి. కాగా, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వర్షం తెల్లవార్లూ పడుతూనే ఉంది.

ఈ ఉదయం రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు, రోడ్లపై నిలిచిన నీటిని మ్యాన్ హోల్స్ ద్వారా తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట నిమ్స్, అమీర్ పేట చౌరస్తా, మాదాపూర్, రామాంతపూర్, మెహిదీపట్నం, కూకట్ పల్లి తదితర ఎన్నో ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో, వాటిని బయటకు తోడేసే పనుల్లో కాలనీవాసులు నిమగ్నం అయ్యారు. కాగా, వర్షాలు నేడు, రేపు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News