Amit Shah: చైనా వ్యవహారంపై పార్లమెంటులో ఎలాంటి చర్చకైనా సిద్ధం: అమిత్ షా
- రాహుల్ ఊహాజనిత రాజకీయాలు మానుకోవాలని హితవు
- సరెండర్ మోదీ హ్యాష్ ట్యాగ్ పై పునరాలోచించుకోవాలన్న షా
- రాహుల్ వ్యాఖ్యలు బాధాకరమని వెల్లడి
చైనా అంశాన్ని పార్లమెంటులో వివరించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బదులిచ్చే ప్రయత్నం చేశారు. చైనా వ్యవహారంపై పార్లమెంటులో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని అమిత్ షా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో ఊహాజనిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాహుల్ గాంధీ చైనా, పాకిస్థాన్ లకు నచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు తమ ప్రభుత్వం దేనికైనా జవాబిస్తుందని, 1962 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో పార్లమెంటులో సిసలైన చర్చకు సిద్ధంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. సరెండర్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ పై రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, పాకిస్థాన్, చైనా ఇలాంటి దుష్ప్రచారాలను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. భారత వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొనే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని, కానీ ఓ అతిపెద్ద రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి ఇలాంటి ఊహాజనిత రాజకీయాలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.