Lockdown: జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్... ప్రతిపాదనలు వస్తున్నాయి: సీఎం కేసీఆర్
- జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వెల్లువ
- నిన్న ఒక్కరోజే 888 కొత్త కేసులు
- వ్యూహం ఖరారు చేయాలంటూ సీఎం ఆదేశాలు
తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే జీహెచ్ఎంసీ పరిధిలో వస్తున్న కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో ముప్పావు భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 888 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఇలా ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై దృష్టి సారించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని వెల్లడించారు. మరో మూడ్నాలుగు రోజుల్లో దీనిపై పక్కా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు పటిష్ట వ్యూహం తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. లాక్ డౌన్ విధించేదీ, లేనిదీ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అయితే, కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా వస్తున్నాయని భయపడరాదని, అందరికీ చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగానే ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.