TS High Court: కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేం.. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు!
- సచివాలయ నిర్మాణం విధాన పరమైన నిర్ణయమన్న ప్రభుత్వం
- ప్రజాధనం దుర్వినియోగమన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు
- కూల్చివేతకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్ల కొట్టివేత
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టి వేస్తూ, హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తూ, కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతినిచ్చింది. ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు వాదనలు విన్నది.
సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంపై కోర్టు జోక్యం చేసుకోవద్దని, ప్రస్తుతం ఉన్న సచివాలయం అన్ని అవసరాలకు సరిపోవట్లేదని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. అయితే, సచివాలయం పేరిట ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోదంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న నూతన సచివాలయ పనులకు ఆటంకాలు తొలగిపోయాయి.