KTR: హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు కోసం కృషి చేస్తాం: కేటీఆర్
- హుజూర్ నగర్ లో ఆర్డీవో కార్యాలయం ప్రారంభించిన కేటీఆర్
- పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
- ఉత్తమ్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు కూడా ఏమీ లేవని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. త్వరలోనే హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ ముఖ్యమైన ఆర్ధిక కేంద్రమని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరమని అన్నారు. ఈ నగరాల మధ్య రైలు వస్తే జాతీయ రహదారి వెంబడి బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
కరోనాతో యావత్ ప్రపంచం అల్లకల్లోలం అవుతోందని, అయినప్పటికీ జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ రైతులు, పేదల కోసం అన్ని పథకాలు కొనసాగిస్తున్నామని వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పథకాలకు అవకాశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ అంశం కూడా ప్రస్తావించారు.
ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే తాట తీయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న ఉత్తమ్ కుమార్ కు కేటీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.