Visakhapatnam District: విశాఖలో మళ్లీ కలకలం రేపిన విషవాయువు.. ఫార్మాసిటీలో లీకైన గ్యాస్.. ఇద్దరి మృతి
- రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఘటన
- మూడు గంటల తర్వాత సమాచారమిచ్చిన కంపెనీ యాజమాన్యం
- ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
విషవాయువు లీకేజీతో విశాఖపట్టణం మరోమారు ఉలిక్కిపడింది. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిందీ ఘటన. గత రాత్రి 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత సదరు కంపెనీ పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన షిఫ్ట్ ఇన్చార్జ్ రాగినాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.