Amarender Singh: 1999 వరకూ అన్ని యుద్ధాలను మనం గెలిచాం... ఇప్పుడు మీ సత్తా చాటండి: అమరీందర్ సింగ్
- భారత్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
- చైనా కంపెనీల విరాళాలు వెనక్కు ఇచ్చేయండి
- పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, 1999 వరకూ జరిగిన అన్ని యుద్ధాల్లోనూ మనం గెలిచామని, ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వంతు వచ్చిందని, వారి సత్తా ఏంటో చూపాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. 1948, 1965, 1971, 1999ల్లో జరిగిన యుద్ధాల్లో భారత్ తన సత్తా ఏమిటో చూపిందని ఆయన గుర్తు చేశారు.
"1960 నుంచి చైనాతో ఇబ్బందులు అప్పుడప్పుడూ తలెత్తుతూనే ఉన్నాయి. గాల్వాన్ తొలి ఘటనేమీ కాదు. భారత ప్రభుత్వం సైనికపరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారనే అనుకుంటున్నాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అక్సాయి చిన్, సియాచిన్ మధ్య ప్రాంతంపై మరింత దృష్టిని సారించాలి" అని అమరీందర్ వ్యాఖ్యానించారు.
చైనా కంపెనీలు పీఎం కేర్స్ కు ఇచ్చిన నిధులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని సూచించిన ఆయన, కరోనా వైరస్ పై పోరాడేందుకు అవసరమైన నిధిని పెంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫండ్ లో కొన్ని చైనా కంపెనీల విరాళాలు ఎందుకని ప్రశ్నించారు. చైనాపై కఠిన వైఖరిని అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయా కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేసుకుంటున్నా, సరిహద్దుల్లో సైనికులపై దాడి చేసిన చైనా కేంద్రంగా పనిచేస్తున్న వాటి నుంచి నిధులు అవసరం లేదని అమరీందర్ అభిప్రాయపడ్డారు.