paytm: చైనా యాప్‌లను నిషేధించినట్లే.. దేశంలో పేటీఎంనూ బ్యాన్ చేయాల్సిందే: తమిళనాడు ఎంపీ
- ఆ యాప్‌లో చైనా పెట్టుబడులు పెట్టింది
- యాంట్ ఫైనాన్షియల్స్ నుంచి 29.71 శాతం పెట్టుబడులు
- అలీబాబా గ్రూప్ నుంచి 7.18 శాతం
- ఈ రెండు సంస్థలు చైనాకు చెందిన బహుళజాతి సంస్థలే
చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ముఖ్యమైన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో దేశీయ యాప్ పేటీఎంను కూడా నిషేధించాలని తమిళనాడు ఎంపీ మణిక ఠాగూర్ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ యాప్‌లో చైనా పెట్టుబడులు పెట్టిందని ఆయన గుర్తు చేశారు.
దేశంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేటీఎంలో చైనా పెట్టుబడులు భారీగా ఉన్నాయని మోదీకి ఆయన ట్వీట్ చేశారు. యాంట్ ఫైనాన్షియల్స్ నుంచి 29.71 శాతం, అలీబాబా గ్రూప్ నుంచి 7.18 శాతం పెట్టుబడులు ఉన్నాయని చెబుతూ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆయన పోస్ట్ చేశారు.
చైనా సంస్థలయిన అలీబాబా, యాంట్ ఫైనాన్షియల్స్ కూడా చైనాకు చెందిన బహుళజాతి సంస్థలేనని చెప్పారు. భారత్‌లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, విదేశీ ఉత్పత్తులను తగ్గించాలంటే పేటీఎంను కూడా బ్యాన్ చేయాలని చెప్పారు.