Imran Khan: భారత్ పై మరోసారి విషం కక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- కశ్మీర్ లో భారత్ డొమిసైల్ సర్టిఫికెట్లు ఇచ్చిందంటూ ఆగ్రహం
- ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు
- ప్రపంచ నేతలను కలుస్తున్నామన్న పాక్ ప్రధాని
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ ను భారత్ తన అనుబంధ భూభాగంగా చూపించే ప్రయత్నం చేయడం తొలి తప్పు అయితే, ఇప్పుడు అక్కడి ప్రజలకు స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు (డొమిసైల్ సర్టిఫికెట్లు) ఇవ్వడం మరో తప్పు అని ఇమ్రాన్ ఆరోపించారు. 25 వేల మందికి తాజాగా డొమిసైల్ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది అక్రమం అని, తమకు చెందాల్సిన భూభాగంలో భారత్ పెత్తనం ఏంటని ఇమ్రాన్ అక్కసు వెళ్లగక్కారు.
ఇది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను, నాల్గవ జెనీవా ఒడంబడిక సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు. దీనిపై తాము ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ ను సంప్రదించామని తెలిపారు. ప్రపంచ నేతలను కూడా కలుస్తున్నామని, అంగీకార యోగ్యం కాని ఈ చర్యను భారత్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారత్ చర్యలతో దక్షిణాసియాలో శాంతి, భద్రతలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ట్వీట్ చేశారు. కశ్మీరీ ప్రజల న్యాయమైన, అంతర్జాతీయంగా ఆమోదించబడిన హక్కులను లాగేసుకునే విధానాలకు భారత్ స్వస్తి పలకాలని పేర్కొన్నారు.