Chandrababu: మూడ్రోజుల పాటు అతడ్ని కాపాడింది ఎవరు?: నెల్లూరులో దివ్యాంగురాలిపై దాడి ఘటనపై చంద్రబాబు
- నెల్లూరు టూరిజం విభాగం ఉద్యోగినిపై అధికారి దాడి
- దాడికి పాల్పడిన వ్యక్తిని ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు?
- ఇది చేతకానితనం కాకపోతే మరేంటి? అంటూ ప్రశ్నించిన బాబు
నెల్లూరు టూరిజం శాఖ కార్యాలయంలో ఉషారాణి అనే ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించాయి. అటు పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉషారాణిపై దాడి జరిగింది ఈ నెల 27న అని, కానీ ఆ వీడియో ఇవాళ వైరల్ అయిందని, దాంతో హడావుడిగా స్పందించి అతడ్ని అరెస్ట్ చేశారని చంద్రబాబు వివరించారు. ఈ దాడి ఉదంతంలో కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయని పేర్కొన్నారు.
"దాడికి పాల్పడిన వ్యక్తిని ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మూడ్రోజుల పాటు అతడ్ని కాపాడింది ఎవరు? బాధితురాలికి ఎందుకు రక్షణ కల్పించలేదు? సాధారణ పరిస్థితుల్లో తమను ఆశ్రయించే మహిళల పట్ల కూడా పోలీసుల నుంచి ఇలాంటి స్పందనే ఉంటుందా? దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఊదరగొట్టారు... ఇప్పుడేం మాట్లాడరేం? ఇది చేతకానితనం కాకపోతే మరేంటి? ఆంధ్రప్రదేశ్ లో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఈ ఘటన ఓ ఉదాహరణ" అంటూ నిశిత విమర్శలు చేశారు.