Mohan Lal: చైనా సైనికుల దాడి నేపథ్యంలో భారీ చిత్రం!
- వాస్తవ సంఘటనల నేపథ్యంలో సినిమాల నిర్మాణం
- గాల్వన్ వాలీ దాడి కథాంశంతో మలయాళ సినిమా
- మోహన్ లాల్ హీరోగా 'బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్'
దేశంలో చోటుచేసుకునే సమకాలీన సంచలన సంఘటనలపై సినిమాలు నిర్మించడం మనం తరచుగా చూస్తూనే వుంటాం. ప్రజలను బాగా ఆకర్షించిన సంఘటనలను తీసుకుని, వాటి చుట్టూ చక్కని కథ అల్లి మన దర్శకులు సినిమాలు రూపొందిస్తూ వుంటారు.
అలాగే, ఇప్పుడు మనకు హాట్ టాపిక్ 'గాల్వన్ వాలీ'! ఇటీవల చైనా సైనికులు ఆ లోయలో మన సైనికులపై దాడి చేయడం.. మన జవాన్లు వీరోచితంగా పోరాడి వారికి బుద్ధి చెప్పడం తెలిసిందే. ఈ ఘటనలో మన సైనికులు 21 మంది అమరులైతే, చైనా సైనికులు దాదాపు 40 మంది మరణించినట్టు వార్తలొచ్చాయి.
ఇప్పుడీ గాల్వన్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. గతంలో మోహన్ లాల్ హీరోగా '1971 బియాండ్ బోర్డర్స్' చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నటుడు, దర్శకుడు మేజర్ రవి ఇప్పుడీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి 'బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్' అనే టైటిల్ ని కూడా ఆయన అప్పుడే నిర్ణయించారు. ఇక ఇందులో మోహన్ లాల్ హీరోగా నటిస్తారన్నది తాజా సమాచారం. భారీ బడ్జెట్టుతోనే ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది.