saqlain mushtaq: 1999 ప్రపంచకప్ నాటి ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టిన పాక్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్
- భార్యలను ఇంటికి పంపాలని పీసీబీ నుంచి ఆదేశం
- అందరూ పంపినా ముస్తాక్ మాత్రం పంపని వైనం
- ఎవరికీ తెలియకుండా అల్మారాలో దాచిన క్రికెటర్
1999 ప్రపంచకప్ సందర్భంగా చేసిన ఓ తుంటరి పనిని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను డిసెంబరు 1998లో వివాహం చేసుకున్నానని, 1999లో ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు. ఏమైందో ఏమో కానీ ఆటగాళ్లు తమ భార్యలను వెనక్కి పంపాలంటూ పీసీబీ నుంచి ఆదేశాలు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు.
అప్పటికి తనకు పెళ్లయి ఆరు నెలులు మాత్రమే అయిందని, ఉదయం ప్రాక్టీస్‌లో ఉండి, సాయంత్రం భార్యతో గడిపేవాడినని పేర్కొన్నాడు. అయితే, పీసీబీ నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని, హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్‌తో మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. అయితే, తాను మాత్రం భార్యను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకున్నానని, దీంతో భార్యను ఇంటికి పంపినట్టు అబద్ధం చెప్పానని పేర్కొన్నాడు. జట్టు మేనేజర్, ఇతర అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం ఓ అల్మారాలో ఆమెను దాక్కోమని చెప్పేవాడినని ముస్తాక్ పేర్కొన్నాడు.
ఆ తర్వాత ఒకరోజు తమ మేనేజర్, మరో అధికారి పరిశీలించి వెళ్లారని, వారికేమీ అనుమానం రాలేదని అన్నాడు. అయితే, ఒకసారి అజర్ మహమూద్, మొహమ్మద్ యూసుఫ్‌లు తనతో మాట్లాడడానికి వచ్చి తన గదిలో ఎవరో ఉన్న విషయాన్ని గుర్తించారని ముస్తాక్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆమెను బయటకు రమ్మనమని చెప్పానని, ఈ విషయాన్ని వారు కూడా గోప్యంగానే ఉంచారని ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత జట్టు సభ్యులందరూ బాగా డీలా పడిపోయామని, ఆ వెంటనే తాను హోటల్ రూముకు వెళ్లి తన భార్యను తిరిగి లండన్ పంపానని పేర్కొన్నాడు.