Varavararao: మాకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారనడం నిజం కాదు: వరవరరావు అల్లుడు
- వరవరరావు ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు
- భార్యకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారన్న మీడియా
- వివరణ ఇచ్చిన వరవరరావు అల్లుడు
ముంబయిలోని తలోజా కారాగారంలో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్యం క్షీణించిందని, ఆయన భార్యకు జైలు అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారని మీడియా చానళ్లలో వార్తలు వచ్చాయి. దీనిపై వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు. తమకు జైలు అధికారులు సమాచారం అందించారనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జైల్లో ములాఖాత్ లు లేనందున వారానికోసారి ఫోన్ చేసే వీలు కల్పించారని, దాంతో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులకు వరవరరావు ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన మాట్లాడిన తీరును బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. అంతేతప్ప, జైలు అధికారుల నుంచి వరవరరావు ఆర్యోగంపై ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, దానిపై రేపు విచారణ జరుగుతుందని వరవరరావు అల్లుడు వెల్లడించారు. కింది కోర్టులో ఇప్పటికే ఓసారి బెయిల్ పిటిషన్ వేయగా, న్యాయమూర్తి ఆ పిటిషన్ ను కొట్టివేయడం తెలిసిందే.