Kanakamedala Ravindra Kumar: నేను వైసీపీ నేతలను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను: టీడీపీ ఎంపీ కనకమేడల
- జగన్ అక్రమ సంపాదన చేశారని సీబీఐ నిర్ధారించింది
- సీబీఐ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేశారు
- సీబీఐ విచారణ జరగకుండా అడ్డుకుంటోంది ఎవరు?
- రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడి, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడకూడదు. మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ పరిధికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది' అని చెప్పారు.
'రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? చంద్రబాబు ప్రారంభించిన రాజధానిని ఎందుకు కొనసాగించట్లేదు? గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు. దాదాపు 13 నెలలు అవుతోంది వారు అధికారంలోకి వచ్చి.. నేటి వరకు స్పష్టమైన ఆధారాలు చూపలేకపోతున్నారు' అని కనకమేడల విమర్శించారు.
మాట్లాడితే సీబీఐ విచారణ జరగాలని వైసీపీ నేతలు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 'ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను. అదే సీబీఐ 43 వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేశారని నిర్ధారించి సీబీఐ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేశారు. సీబీఐ విచారణ జరగకుండా అడ్డుకుంటోంది ఎవరు?' అని కనకమేడల ప్రశ్నించారు.
'ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తోన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేయించారు. మీరు ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏమిటి? అవన్నీ కక్షపూరితంగానే పెట్టారు. రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఐఏఎస్లు బలైపోయారు. ఇప్పటికీ వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు' అని కనకమేడల విమర్శించారు.
'కులాలను అడ్డుపెట్టుకుని, కులాలను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై వస్తోన్న వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు?' అని కనకమేడల ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలపైనా దాడులు చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
న్యాయవ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలని వైసీపీ భావిస్తోందని కనకమేడల అన్నారు. అలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ సొంత ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.