Dubshoot: టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా మన హైదరాబాద్ యాప్!
- టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధించిన భారత్
- 'డబ్ షూట్' యాప్ కు పెరుగుతున్న ప్రజాదరణ
- ఐదు లక్షలకు పైగా డౌన్ లోడ్లు
టిక్ టాక్ యాప్ కు భారత్ లో ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిత్యం టిక్ టాక్ వీడియోలతో సందడి చేసేవాళ్లు. అయితే, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్ లను భారత్ నిషేధించింది. వీటిలో టిక్ టాక్ కూడా ఉంది. దాంతో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా వినోదం పంచే యాప్ ల వైపు భారత నెటిజన్ల దృష్టి మళ్లింది. ఇప్పుడు తాజాగా 'డబ్ షూట్' అనే యాప్ ప్రజాదరణ పొందుతోంది.
ఇది కూడా టిక్ టాక్ తరహాలో వీడియో యాప్. దీన్ని హైదరాబాద్ కు చెందిన 'ఎం టచ్' ల్యాబ్స్ అభివృద్ధి చేసింది. తాజా పరిణామాలపై 'డబ్ షూట్' సీఈఓ వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి 'డబ్ షూట్' ను డౌన్ లోడ్ చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని వివరించారు. ఇటీవల కేంద్రం 59 చైనా యాప్ లపై నిషేధం ప్రకటించిన తర్వాత, 'డబ్ షూట్' యాప్ కు ఐదు లక్షలకు పైగా డౌన్ లోడ్లు వచ్చాయి.