UNO: చైనాకు భంగపాటు... భారత్ వ్యతిరేక తీర్మానాన్ని ఐరాసలో అడ్డుకున్న జర్మనీ, యూఎస్!
- కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి
- హేయమైనదిగా అభివర్ణిస్తూ, చైనా ప్రకటన
- ఐరాస ఆమోదించకుండా అడ్డుకున్న అగ్రదేశాలు
పాకిస్థాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై గత వారం జరిగిన ఉగ్రదాడి వెనుక ఇండియా ఉందని ఆ దేశ ప్రధాని సహా పలువురు నాయకులు ఆరోపిస్తున్న వేళ, ఈ దాడిని ఖండిస్తూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేయాల్సిన ప్రకటనను జర్మనీ, యూఎస్ అడ్డుకున్నాయి. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ కోసం చైనా ప్రవేశపెట్టింది. దీనిపై ఐరాస ఓ ప్రకటన చేయాల్సి వుండగా, తొలుత జర్మనీ, ఆపై యూఎస్ తమ అధికారాలను వినియోగించి అడ్డుకున్నాయి. కాగా, పాక్ లో ఏ చిన్న దాడి జరిగినా, ఇండియాను నిందించే అక్కడి నేతలు, ఐరాసలో యూఎస్, జర్మనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ఇండియాకు మద్దతుగా నిలవడాన్ని జీర్ణించుకోలేకున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఒసామా బిన్ లాడెన్ అమర వీరుడని, కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రవాదులు చేసిన దాడి వెనుక భారత్ ఉందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్పై దాడి అత్యంత హీనమైనదంటూ, పాక్ మిత్ర దేశం చైనా ఈ ప్రకటనను రూపొందించగా, జర్మనీ, అమెరికా అభ్యంతరం వ్యక్తం చేశాయి.