Andhra Pradesh: ఏపీలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లలోనే అత్యధిక కరోనా కేసులు!

Corona cases raised in AP in certain age group

  • 16-45 ఏళ్ల వారిలో ఎక్కువ కరోనా కేసులు
  • 60 ఏళ్లకు పైబడిన వారిలో 9.96 శాతం కేసులు
  • ఎక్కువ మరణాలు ఈ ఏజ్ గ్రూప్ లోనే!

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వారాలుగా కరోనా కేసుల పెరుగుదల తీవ్రతరం అవుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేలు దాటింది. అయితే మరణాల రేటు తక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే విషయం. 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీలోనే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళనకంగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

సాధారణంగా పెద్ద వయస్కులకు కరోనా సులభంగా సోకే అవకాశం ఉందని చెబుతున్నా, ఏపీలో మాత్రం 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులకు కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని వెల్లడైంది. జూలై 3 వరకు నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుంటే 16 నుంచి 45 ఏళ్ల లోపు వారు 62 శాతం (10,500 కేసులు) ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 46 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు 20 శాతం (3,450 కేసులు) ఉన్నారట.

ఇక, 15 ఏళ్ల లోపు పిల్లల్లో కరోనా సోకిన వారి సంఖ్య 1200గా (7.18 శాతం) నమోదైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పిల్లల్లో చాలా తక్కువగానే కరోనా లక్షణాలు కనిపిస్తుండడమే కాదు, కొందరిలో అసలు లక్షణాలే ఉండడంలేదట. వారు చికిత్సకు కూడా చక్కగా స్పందిస్తున్నారని వైద్య వర్గాలంటున్నాయి.

రాష్ట్రంలో 60 ఏళ్లకు పైబడిన కరోనా బాధితులు 9.96 శాతం ఉండగా, మరణాల సంఖ్య కూడా వారిలోనే ఎక్కువగా ఉందని స్పష్టమైంది. వృద్ధుల్లో మధుమేహం, బీపీ, హృద్రోగాలు ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు.

  • Loading...

More Telugu News