Devineni Uma: ఏపీలో కరోనా బాధితులకు మంచినీళ్లు, మందులైనా ఇస్తున్నారా?: దేవినేని
- రాష్ట్రంలో ఎన్ని క్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి?
- పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు?
- మెనూ వివరాలు ఏంటి?
- ఈ ఆహారం తినలేమంటున్న బాధితులు ఆక్రందనలు వినిపించడం లేదా? అన్న దేవినేని
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో రోగులు పడుతున్న బాధలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలో ఎన్ని క్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి? పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు? మెనూ వివరాలు ఏంటి? గత వందరోజుల్లో క్వారంటైన్ లో ఎంతమంది ఉన్నారు? మంచినీళ్లు, మందులైనా ఇస్తున్నారా? నాణ్యత లేని ఆహారం తినలేమంటున్న బాధితుల ఆక్రందనలు మీకు వినిపించడం లేదా జగన్ గారు?' అని నిలదీశారు.
ఈ సందర్భంగా దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. ఉడకని అన్నం, మాడిపోయిన చపాతీ, నీళ్ల సాంబారుతో భోజనాలు పెడుతున్నారని అందులో ఉంది. పౌష్టికాహారం పేరుతో మనుషులు తినలేని విధంగా ఉన్న ఆహారాన్ని అందిస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, మంచినీళ్లు, మందులు కూడా సరిగ్గా అందించట్లేదని పేర్కొన్నారు. నాణ్యత లేని ఆహారం తినలేమంటూ కరోనా రోగులు హోం క్వారంటైన్‌కు పంపాలని వేడుకుంటున్నారని అందులో చెప్పారు.