Botsa: జగన్ మంచి చేస్తుంటే కోర్టుల నుంచి స్టే తెస్తూ ప్రతిపక్షం కుట్రలు చేస్తోంది: బొత్స
- ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
- టీడీపీ ఆటంకాలు సృష్టిస్తోందన్న బొత్స
- ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ వ్యాఖ్యలు
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ నెల 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాలు అందించాలని భావిస్తోంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం కావొచ్చేమో కానీ, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. పేదలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే ప్రతిపక్షం కోర్టుల నుంచి స్టే తెస్తూ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
"మొదట 25 లక్షల మందికి ఇద్దామనుకున్నాం, కానీ సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని నిర్ణయించుకున్నారు. భూములు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. పేదలకు భూమి ఇచ్చేంతలో టీడీపీ కుట్రలు చేస్తోంది. కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చి ఆటంకాలు సృష్టిస్తోంది" అని మండిపడ్డారు. టీడీపీ కుట్రలను ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు.