Corona Virus: కొబ్బరినూనెతో కరోనా కట్టడి... వాస్తవం ఎంత?
- కేరళీయులపై పెద్దగా కనిపించని కరోనా ప్రభావం
- వంటల్లోనూ కొబ్బరినూనె వాడే కేరళీయులు
- కొబ్బరినూనెలో ఇమ్యూనిటీ కారకాలు ఎక్కువంటున్న ఓ అధ్యయనం
భారతదేశం ఆయుర్వేద వైద్య శాస్త్రానికి పుట్టినిల్లు. భారతీయులు విరివిగా ఉపయోగించే కొబ్బరినూనెలో ఔషధ విలువలు ఉన్నాయని ప్రాచీనకాలం నుంచి భావిస్తున్నారు. కేరళలో అయితే కొబ్బరినూనెను వంటల్లోనూ ఉపయోగిస్తారు. ఇప్పుడా కొబ్బరినూనె కారణంగానే కేరళలో కరోనా పెద్దగా ప్రభావం చూపడంలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫిజీషియన్స్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనంలో దీనిపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ శశాంక్ జోషి కొబ్బరినూనె విశిష్టత గురించి వివరిస్తూ, కొబ్బరినూనెను ఎక్కువగా వాడుతుండడం వల్లే కేరళ ప్రజలు కరోనా మహమ్మారిపై గట్టిగా పోరాడగలుగుతున్నారని తెలిపారు. కొబ్బరినూనెలో ఇమ్యూనిటీని పెంచే కారకాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. కొబ్బరినూనెలోని యాంటీ మైక్రోబయాల్ కారకాలు... శరీరంలో రోగనిరోధక వ్యవస్థ స్పందనకు కీలకమని భావించే యాంటీ ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను క్రియాశీలకంగా మార్చుతాయని వివరించారు.
మనుషుల్లో కొబ్బరినూనెతో ఎలాంటి ప్రమాదం లేదని, కొబ్బరినూనె, దాన్నుంచి తయారయ్యే ఉత్పత్తులు మానవ శరీరంలో ఇమ్యూనో మాడ్యులేటరీ ఏజెంట్లుగా అత్యంత సురక్షితమని, పైగా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. కాగా, కరోనాపై కొబ్బరినూనె సమర్థతపై జరిగిన ప్రయోగాలు స్వల్పమని, మరింత అధ్యయనం జరగాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు. అయితే, కొబ్బరినూనెను వైద్యుల సలహా లేకుండా వంటల్లో ఉపయోగించరాదని, నేరుగా సేవించరాదని మరోపక్క హెచ్చరిస్తున్నారు.