WHO: చెప్పినట్లే చేస్తోన్న ట్రంప్.. డబ్ల్యూహెచ్‌వో నుంచి నిష్క్రమణ ప్రక్రియ షురూ
- ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వోకు నిధుల నిలిపివేత
- ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని ఐరాసకు తెలిపిన అమెరికా
- అమెరికా కాంగ్రెస్‌కు కూడా నోటిఫై
- ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టే ఛాన్స్
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆ సంస్థకు నిధులు ఆపేసిన విషయం తెలిసిందే. చైనాలో పుట్టిన ఆ వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌వో జాప్యం చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా, ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని కూడా ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అమెరికాలో ప్రక్రియ ప్రారంభమైంది. డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతామని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా కాంగ్రెస్‌కు ఆయన తెలిపారు.
ఆ సంస్థ నుంచి తప్పుకునేందుకు అమెరికా తమకు నోటిఫై చేసిందని సంబంధిత అధికారి స్టిఫేన్ డుజారిక్ చెప్పారు. అయితే, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టనుంది.
ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జూలై 6 వరకు కొనసాగనున్నట్లు సమాచారం. ఆ సంస్థ నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు తమకు కూడా లేఖ అందిందని ఫారిన్ రిలేషన్స్ కమిటీ డెమోక్రాట్ సేనేటర్ రాబర్ట్ మెనెన్‌డేజ్ కూడా చెప్పారు. అయితే, ఈ విషయంపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మాత్రం మరోలా స్పందించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే డబ్ల్యూహెచ్‌వోతో మళ్లీ కలిసి పనిచేస్తామని తెలిపారు.