Corona Virus: 90 శాతం యాక్టివ్ కేసులు 8 రాష్ట్రాల్లోనే... 86 శాతం మరణాలు 6 రాష్ట్రాల నుంచే!
- 49 జిల్లాలను హాట్ స్పాట్ లుగా గుర్తించిన కేంద్రం
- కరోనాపై కేంద్ర మంత్రివర్గం 18వ భేటీ
- మరణాల రేటు అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి
ఇండియాలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 90 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చే కేసులదే అత్యధిక వాటా. ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఈ రాష్ట్రాల్లోని 49 జిల్లాలు కరోనా కేసులకు హాట్ స్పాట్ లుగా మారాయని కేంద్రం వెల్లడిస్తున్న గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఇక మరణాల విషయానికి వస్తే, 86 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా, మరణాల సంఖ్య అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం 18వ భేటీ నిర్వహించగా, ఈ వివరాలను ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ వెల్లడించారు. మరణాల రేటు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు ఆయన తెలిపారు.
కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న టాప్-5 దేశాలతో పోలిస్తే, ప్రతి 10 లక్షల మందిలో 1,452 కేసులు, 68.7 మరణాలు సంభవిస్తుండగా, ఇండియాలో ఇది 538 కేసులు, 15 మరణాలుగా మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇండియాలో ప్రస్తుతం 3.77 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 39,820 ఐసీయూ బెడ్లు, 1.42 లక్షలకు పైగా ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్, 20 వేలకు పైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
దేశంలో తాము ఇంతవరకూ 21.30 కోట్ల ఎన్ 95 మాస్క్ లను, 1.20 కోట్ల పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్), 6.10 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను సరఫరా చేశామని కేంద్రం వెల్లడించింది. "సమీప భవిష్యత్తులో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన కంటెయిన్ మెంట్ నిబంధనలు, నిఘా, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వంటి కార్యక్రమాలను చేపట్టనున్నాం. పెరుగుతున్న హాట్ స్పాట్ ల సంఖ్యను ఆరోగ్య సేతు వంటి యాప్ లను మరింతగా ప్రోత్సహించడం ద్వారా తగ్గిస్తాం" అని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు.