Vijayashanti: సీఎం దొరగారు ఎప్పుడు ఫాంహౌస్ లో ఉంటారో, ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో తెలియడంలేదు: విజయశాంతి
- సీఎం కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు
- దొర పాలనలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యలు
- నర్సులకు జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్నారని ఎద్దేవా
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం దొరగారు ఎప్పుడు ఫాంహౌస్ లో ఉంటారో, ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో తెలియని దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలనలో ఎంతటి అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయో తాజా పరిణామాలతో అర్థమవుతోందని తెలిపారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడుతున్న వైద్య సిబ్బంది అవమానాల పాలవుతున్నారని, ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వెల్లడించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్లు నములుతోందని విజయశాంతి విమర్శించారు. అటు, దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి జీతాలు ఇచ్చారని, ఆ డబ్బుతో ఎలా బతకాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటూ ఆమె మండిపడ్డారు.