Corona Virus: కరోనా కష్టాలు మరిన్ని తప్పవు.. మహంకాళి బోనాల్లో జోగిని స్వర్ణలత భవిష్యవాణి
- ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదు
- కరోనాను కట్టడి చేయడానికి నేను సిద్ధం
- ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయాలి
- ఈ సారి జరుగుతోన్న ఉత్సవాలు సరిగ్గా లేవు
కరోనా కష్టాలు తప్పవని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత తెలిపారు. బోనాల సందర్భంగా ఆమెలో అమ్మవారు పూని భవిష్యవాణి చెబుతుందని భక్తుల నమ్మకం. శివసత్తుల శిగాలతో, ఊరేగింపులతో, పోతు రాజుల విన్యాసాలతో ప్రతి ఏడాది జరిగే బోనాల జాతర ఈ సారి నిరాడంబరంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా స్వర్ణలత చెప్పిన భవిష్యవాణిలో అమ్మవారు ప్రజలకు హెచ్చరికలు చేశారు. రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదని గుర్తు చేశారు. కరోనాను కట్టడి చేయడానికి తాను సిద్ధమని, అయితే, తనను కొలవాలని, ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయాలని చెప్పారు.
ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు తీసుకురావాలని, ఈ పూజలు భక్తిభావనతో చేస్తే తప్పకుండా కాపాడతానని తెలిపారు. ప్రతి గడప నుంచి తనకు నైవేద్యాలు సమర్పించాలని ఆజ్ఞాపించారు. ఈ సారి జరుగుతోన్న ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని తెలిపారు.
కాగా, 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగువ్యాధి అంతరించడంతో అప్పట్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ప్రారంభమైంది. ప్రతి ఏడాది బోనాలకు వేలల్లో జనం హాజరయ్యేవారు. వానాకాలం ప్రారంభంలో అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు కాపాడుతుందని నమ్ముతారు.