Bandi Sanjay: టీఆర్ఎస్ నేతలు దమ్ము, ధైర్యం లేని చేతకాని దద్దమ్మలు: బండి సంజయ్ ఫైర్
- పోలీసుల పహారాలో టీఆర్ఎస్ నేతలు కాలాన్ని వెళ్లదీస్తున్నారు
- ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ దాడికి పోలీసులు సహకరించారు
- ప్రజాందోళనలు ఇక మీదట మరింత ఉద్ధృతమవుతాయి
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ను నిన్న టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ నేతలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దమ్ము, ధైర్యం లేని దద్దమ్మలు టీఆర్ఎస్ నేతలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు పహారాలో టీఆర్ఎస్ నేతలు కాలాన్ని వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ బండి సంజయ్, వరంగల్ బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ పార్టీ చేసిన దాడికి పోలీసులు సహకరించారని విమర్శించారు. బీజేపీ చేపట్టే ఉద్యమాలతో టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
'ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత సెగ తాకకుండా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రజల మద్దతు, బలంతోనే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్ద బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. వరంగల్ బీజేపీ కార్యాలయం పైన, ఎంపీ ధర్మపురి అరవింద్ పైన అధికార టీఆర్ఎస్ పార్టీ దాడి చేయడాన్ని నిరసిస్తూ, నేడు వివిధ జిల్లాలలో నిరసన కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేసింది. వందలాది మందిని అరెస్టు చేసి,కేసులు పెట్టారు.
ప్రభుత్వం సరైన దిశలో నడవనప్పుడు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నప్పుడు నిరసన కార్యక్రమాలను చేయడం రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే విధంగా కేసు నమోదు చేయడం దుర్మార్గం. కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం వారి క్రూర మనస్తత్వానికి నిదర్శనం. బీజేపీ కార్యాలయంపై, ధర్మపురి అరవింద్ పై దాడి జరుగుతున్న సమయంలో దాడిని నిలువరించని, భద్రత కల్పించని పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఈరోజు ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇళ్ల ముందు భయంతో పహారా కాస్తున్న పోలీసులకు... బీజేపీ కార్యాలయం, ధర్మపురి అరవింద్ పై దాడి జరుగుతున్న సమయంలో విధులు గుర్తు రాలేదా? అహంకారంతో నియంతృత్వ, నిరంకుశ ధోరణితో మాఫియా పాలన చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు... బీజేపీ రూపంలో ఉన్న ప్రజాందోళనలు ఇక మీదట మరింత ఉద్ధృతమవుతాయి' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.