TTD: ఆదాయం పడిపోయింది.. టీటీడీని ఆదుకోండి: కేంద్ర ఆర్థిక మంత్రితో వైవీ సుబ్బారెడ్డి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో వైవీ సుబ్బారెడ్డి భేటీ
- లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయిందన్న టీటీడీ ఛైర్మన్
- పాత నోట్లను మార్చాలని విన్నపం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో టీటీడీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా టీడీడీ ఆదాయం గణనీయంగా పడిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి సుబ్బారెడ్డి తీసుకెళ్లారు. కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ. 50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు.
స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు వెంటనే నిధులను విడుదల చేయాలని విన్నవించారు. ఇటీవలే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే.