Virat Kohli: కోహ్లీ నా సలహా పాటించాడు.. తొలి సెంచరీ సాధించాడు: కిర్ స్టెన్
- కోహ్లీ తొలి మ్యాచ్ సమయంలో టీమిండియా కోచ్ గా ఉన్న కిర్ స్టెన్
- బంతిని గాల్లోకి లేపొద్దని కోహ్లీకి సూచించానన్న కిర్ స్టెన్
- ఆ తర్వాతి మ్యాచ్ లోనే తొలి సెంచరీ చేశాడని వెల్లడి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి తక్కువ కాలంతోనే ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు. అన్ని ఫార్మాట్లలో రికార్డులను కొల్లగొడుతూ అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. భారత జట్టు కెప్టెన్ గా కూడా సత్తా చాటాడు. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఆరంగేట్రం చేశాడు. ఆ సమయంలో భారత జట్టు కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన కిర్ స్టెన్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... యువ కోహ్లీకి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
కోహ్లీ ఆటను చూసిన తర్వాత అతనిలోని నైపుణ్యాలు, సమర్థత తనను ఆకట్టుకున్నాయని... అయితే, బ్యాటింగ్ పరంగా నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని తనకు అనిపించిందని కిర్ స్టెన్ చెప్పారు. శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా జరిగిన ఒక ఘటనను తాను ఇప్పటికీ మర్చిపోలేనని.. 30 పరుగులతో బాగా ఆడుతున్న కోహ్లీ లాంగ్ ఆన్ లో సిక్స్ కొట్టేందుకు యత్నించి ఔటయ్యాడని తెలిపారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో తాను మాట్లాడానని... నీలో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాలంటే బంతిని గాళ్లోకి లేపకూడదని చెప్పానని అన్నారు. బంతిని గాల్లోకి లేపకుండా బౌండరీ సాధించే సామర్థ్యం నీలో ఉందని, అయితే ఆ షాట్ కొంచెం రిస్క్ తో కూడుకున్నదని సూచించానని తెలిపారు. ఆ తర్వాతి మ్యాచ్ లో కోహ్లీ తొలి సెంచరీ సాధించాడని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ వెనుదిరిగి చూసుకోలేదని తెలిపారు. కిర్ స్టెన్ కోచ్ గా ఉన్నప్పుడే 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ ను గెలుపొందింది.