Revanth Reddy: మరి, ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు?: రేవంత్ రెడ్డి
- సచివాలయం కూల్చివేతకు అనుకూలంగా జూన్ 29న కోర్టు తీర్పు
- ఆ రోజు నుంచే కేసీఆర్ కనిపించకుండా పోయారన్న రేవంత్
- ఇటీవల కూల్చివేతపై హైకోర్టు స్టే
- ఆ మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారని వెల్లడి
సీఎం కేసీఆర్ ఇటీవల కొన్నిరోజులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో కరోనా కలకలం రేగడంతో ఆయన ఫాంహౌస్ కు వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. మళ్లీ ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రత్యక్షమవడంతో ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"జూన్ 28కి ఓ ప్రాధాన్యత ఉంది. ఆ రోజున పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఆపై అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రజలందరికీ కనిపించారు. ఆ మరుసటి రోజు జూన్ 29కి మరో రకమైన ప్రాధాన్యత ఉంది. ఆ రోజు నుంచే సీఎం కేసీఆర్ కనిపించలేదు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ మేమంతా కోర్టుకు వెళితే, ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమంటూ జూన్ 29న హైకోర్టు వెల్లడించింది.
సచివాలయ కూల్చివేతను మేమంతా వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన అంశాలను ఏరోజైతే హైకోర్టు తోసిపుచ్చిందో ఆ రోజు నుంచే సీఎం కేసీఆర్ కనిపించలేదు. మళ్లీ, జూలై 10 నాడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు తదితరులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సచివాలయం కూల్చివేతపై స్టే ఇవ్వగా, ఆ మరుసటి రోజు జూలై 11న కేసీఆర్ ప్రత్యక్షమయ్యాడు. మరి ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన రహస్యంగా గడపడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఇది యాదృచ్ఛికమో, వ్యూహాత్మకమో తెలియడంలేదు కానీ, సచివాలయ కూల్చివేతకు హైకోర్టు అనుకూల నిర్ణయం తీసుకున్నప్పటినుంచే కేసీఆర్ అదృశ్యమయ్యారు" అంటూ వ్యాఖ్యానించారు.