Ravindra Raina: కశ్మీర్ బీజేపీ చీఫ్ కు కరోనా... ఆయనను కలిసిన జితేంద్ర సింగ్, రామ్ మాధవ్ క్వారంటైన్
- రాజకీయ రంగంలో కరోనా కల్లోలం
- జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీంద్ర రైనాకు పాజిటివ్
- రైనాతో ప్రయాణించానన్న జితేంద్ర సింగ్
- రెండ్రోజుల కిందట రైనాను కలిశానన్న రామ్ మాధవ్
దేశవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా రక్కసి రాజకీయ ప్రముఖులను కూడా వెంటాడుతోంది. తాజాగా, జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా కరోనా బారినపడ్డారు. అయితే, ఆయనను ఇటీవలే కలిసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ నేత రామ్ మాధవ్ స్వయం ప్రకటిత క్వారంటైన్ లోకి వెళ్లారు. తాము క్వారంటైన్ లోకి వెళుతున్నామంటూ జితేంద్ర సింగ్, రామ్ మాధవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జూలై 12న శ్రీనగర్ నుంచి బందిపొరా వరకు రవీంద్ర రైనాతో ప్రయాణించామని జితేంద్ర సింగ్ తెలిపారు. రెండ్రోజుల క్రితం రవీంద్ర రైనాతో కలిసి శ్రీనగర్ లో వున్నానని రామ్ మాధవ్ పేర్కొన్నారు. గడచిన 2 వారాల్లో 4 సార్లు టెస్టు చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని వివరించారు. అయితే, తన, ఇతరుల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తగా ఈసారి క్వారంటైన్ లోకి వెళుతున్నానని రామ్ మాధవ్ వెల్లడించారు.