Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోకి నీరు
- తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- నగరంలో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం
- అన్నాసాగర్‌లో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం
హైదరాబాద్‌లో ఈ మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా నీరు చేరడంతో రోగులు అవస్థలు పడ్డారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, జేఎన్టీయూ, ప్రగతినగర్, ముసాపేట, బాలానగర్ ఉప్పల్, నాగోలు, ఈసీఐఎల్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి జిల్లాలోని అన్నాసాగర్‌లో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా సోమూరులో 10.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 9.6, మేడ్చల్ జిల్లా బాలానగర్‌లో 8.7, సంగారెడ్డి జిల్లా కాంగెటిలో 8.7, కామరెడ్డి జిల్లాలోని బిచుకుందలో 8.6 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టు అధికారులు తెలిపారు.