Jagan: ఆరోగ్యశ్రీ పథకం మరికొన్ని జిల్లాలకు విస్తరణ... ప్రారంభించిన సీఎం జగన్
- ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు
- తాజాగా 6 జిల్లాలకు విస్తరణ
- 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ లబ్దిదారుల ఎంపిక
గతంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి పలు మార్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఆరంభం నుంచి అమలు చేస్తోంది. తాజాగా, ఈ పథకాన్ని 6 జిల్లాలకు విస్తరించారు. ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఇకపై ప్రకాశం, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఆరోగ్యశ్రీ విస్తరణ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని వెల్లడించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఒకే ఒక రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. ఖరీదైన వైద్యం కోసం ఎవరూ అప్పుల పాలవరాదన్నదే ఆరోగ్యశ్రీ వెనకున్న ఉద్దేశమని అన్నారు.
ఇప్పటివరకు 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామని, ప్రస్తుతం 2,200 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని సీఎం జగన్ వివరించారు. క్యాన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పొందవచ్చని తెలిపారు. అంతేకాదు, చికిత్స పొందిన తర్వాత కూడా రోజుకు రూ.225 వరకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద అందిస్తామని చెప్పారు.