Odnala Rajesh: తెలంగాణ వాసి కరోనా చికిత్సకు రూ.1.50 కోట్ల బిల్లు... పెద్దమనసుతో మాఫీ చేసిన దుబాయ్ ప్రభుత్వం!
- ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వడ్నాల రాజేశ్
- ఏప్రిల్ లో కరోనా సోకడంతో ఆసుపత్రిపాలు
- 80 రోజుల పాటు చికిత్స
జగిత్యాల జిల్లా పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే ఏప్రిల్ లో రాజేశ్ కు కరోనా సోకింది. దుబాయ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. అయితే అతడికి సుదీర్ఘంగా చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్లు కూడా దుబాయ్ పరిస్థితులకు తగినట్టు అతి భారీగా వచ్చింది. 80 రోజుల పాటు చికిత్సకు గాను రూ.1.50 కోట్ల బిల్లు వేశారు. దాంతో కరోనా కంటే ఆ బిల్లే రాజేశ్ ను భయభ్రాంతులకు గురిచేయగా, ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి.
బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ లో భారత కాన్సులేట్ కు నివేదించాయి. కాన్సులేట్ వర్గాలు రాజేశ్ కరోనా చికిత్స బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి వివరించాయి. దీనిపై పెద్దమనసుతో స్పందించిన దుబాయ్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేకాదు, భారత్ వచ్చేందుకు విమాన ఖర్చులు భరించడంతో పాటు, అదనంగా మరో రూ.10 వేలు ఇచ్చి సహృదయత చాటుకుంది. ఇటీవలే భారత్ చేరుకున్న రాజేశ్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాడు.