Thieves: కరోనా రోగి ఇంట్లో చొరబడి మటన్ తో విందు చేసుకున్న దొంగలు!
- కరోనా సోకడంతో ఇంటి యజమాని ఆసుపత్రిపాలు
- స్వగ్రామానికి వెళ్లిపోయిన భార్యాబిడ్డలు
- ఇదే అదనుగా రెచ్చిపోయిన దొంగలు
దొంగలు ఇళ్లలో చొరబడి అక్కడున్న నగదూ, నట్రా ఎత్తుకుపోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో అక్కడున్నవి సుష్టుగా తిని, హాయిగా గుర్రుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ నగరంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆ వ్యక్తి ఉంటున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అతడిని ఆసుపత్రికి తరలించగా, అతడి భార్య, పిల్లలు స్వగ్రామానికి వెళ్లిపోయారు.
అయితే, అతని ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు అర్ధరాత్రి వేళ ఇంట్లో చొరబడ్డారు. యధేచ్ఛగా తమ పని కానిచ్చారు. రూ.50 వేల నగదుతో పాటు, విలువైన వస్తువులను కూడా మూటగట్టారు. అంతేకాదు, ఆ ఇంట్లోనే మటన్ వండుకుని, చపాతీలు చేసుకుని హాయిగా భోంచేశారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో మరో రెండు ఇళ్లను కూడా చక్కబెట్టి వెళ్లిపోయారు.
కాగా, తన ఇల్లు ఎలావుందో ఓసారి చూసిరమ్మని కరోనా సోకిన వ్యక్తి తన సోదరుడికి చెప్పాడు. ఆ వ్యక్తి సోదరుడు వచ్చి చూడడంతో ఇంట్లో దొంగతనం జరిగిందన్న విషయం అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.